తెలంగాణలో ఆయిల్ పామ్ విప్లవం:
- బండి దుర్గా ప్రసాద్
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వంట నూనెల దిగుమతి భారం ఒక తీరని లోటుగా మారుతోంది. ఏటా సుమారు రూ. 1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కేవలం పామ్ ఆయిల్ దిగుమతుల కోసమే వెచ్చిస్తున్నాం. ఈ నేపథ్యంలో, దేశాన్ని వంట నూనెల రంగంలో 'ఆత్మనిర్భర్'గా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (NMEO-OP) ను ప్రవేశపెట్టాయి. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. తెలంగాణ ప్రభుత్వం వంట నూనెల దిగుమతి భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం సాగుకే పరిమితం కాకుండా, దానిని పారిశ్రామికాభివృద్ధితో అనుసంధానించడం ద్వారా రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మారుస్తోంది.
పారిశ్రామిక అభివృద్ధి - వ్యవసాయ అనుసంధానం
ఆయిల్ పామ్ సాగు కేవలం పొలాల్లోనే కాకుండా, పరిశ్రమల స్థాపనలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. పండించిన గెెలలను (FFB) తక్షణమే ప్రాసెస్ చేయాల్సి ఉండటంతో, ప్రతి సాగు జోన్‌లో ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణం యుద్ధప్రతిపాదికన జరుగుతోంది.
ఉపాధి కల్పన: ఒక్కో ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా వందలాది మందికి నేరుగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.
మారిన సాగు ముఖచిత్రం
ఒకప్పుడు ఆయిల్ పామ్ అంటే కేవలం కోస్తా తీర ప్రాంత పంట అనే అపోహ ఉండేది. కానీ నేడు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబబాద్, , జనగామ, సిద్దిపేట,వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఈ పంట ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోంది. క్షేత్రస్థాయిలో మేము గమనించిన ప్రధాన మార్పు 'ప్రభుత్వ భరోసా'. గతంలో కొన్ని ప్రైవేటు కంపెనీల వైఫల్యాల వల్ల రైతుల్లో నెలకొన్న అపనమ్మకాన్ని తొలగించి, ఆయిల్ ఫెడ్ (TG Oilfed) నేరుగా రంగంలోకి దిగడం సాగు విస్తరణకు బలమైన ఊతాన్నిచ్చింది. ఈ విప్లవం విజయవంతం కావడం వెనుక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు TG Oilfed చైర్మన్ జంగా రాఘవ రెడ్డిల సమన్వయం కీలకమైంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు: ప్రతి జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలన్నది మంత్రి గారి ఆశయం. ప్రైవేటు కంపెనీలు జాప్యం చేస్తే, ఆ జోన్లను రద్దు చేసి ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్‌కు అప్పగిస్తామని ఆయన కఠినంగా వ్యవహరిస్తూ, పనులను వేగవంతం చేస్తున్నారు. "రైతు ఎకరానికి ₹2 లక్షల వరకు ఆదాయం పొంది రాజులా బతకాలి" అన్నదే ఆయన లక్ష్యం.
జంగా రాఘవ రెడ్డి: ఆయిల్ ఫెడ్ చైర్మన్ హోదాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, రైతుల్లో నమ్మకాన్ని నింపుతున్నారు. ఉమ్మడి పది జిల్లాలలో 10 లక్షల ఎకరాల సాగు లక్ష్యంతో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాాణ జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, రైతులకు సాంకేతిక మరియు ఆర్థిక భరోసాను అందిస్తున్నారు.
గణాంకాలు - లాభదాయకత
ఆయిల్ పామ్ రైతుకు ఒక రకంగా 'పెన్షన్' వంటి పంట. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఇది అత్యధిక ఆదాయాన్నిస్తుంది.
దిగుబడి & ఆదాయం: ఒక ఎకరా తోట ద్వారా ఏడాదికి సగటున (ప్రారంభంలో 6 నుంచి ఆ పైన) 10 నుండి 12 టన్నుల గెలల (FFB) దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర సుమారు ₹20,456/- (జనవరి 2026 నాటికి) ఉంది. అంటే, ఎకరాకు అన్ని ఖర్చులు పోను ఏడాదికి ₹1.5 లక్షల నుండి ₹2 లక్షల నికర ఆదాయం రైతుకు లభిస్తుంది.
నీటి పొదుపు: సూక్ష్మ నీటి పారుదల (Drip Irrigation) ద్వారా ఇతర పంటలకంటే 40% నీటిని ఆదా చేయవచ్చు.
నర్మెట్ట: ఒక సాంకేతిక మైలురాయి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట వద్ద ఆయిల్ ఫెడ్ నిర్మించిన ప్రాసెసింగ్ మిల్లు తెలంగాణ గర్వించదగ్గ సాంకేతిక అద్భుతం.
సుమారు ₹300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మిల్లు ఆరంభ దశలో గంటకు 30 మెట్రిక్ టన్నుల గెలలను క్రష్ చేసే సామర్థ్యం కలిగి ఉంది, దీనిని భవిష్యత్తులో 60 TPH కి విస్తరించే అవకాశం ఉంది.
ఇది 'జీరో వేస్ట్' టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇక్కడ వెలువడే వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి (Co-generation) మరియు సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు కూడా అనుసంధానించబడి ఉన్నాయి. ఇది రైతులకు స్థానికంగానే మార్కెటింగ్ భరోసాను కల్పిస్తోంది. ప్రత్యేకతలు: ఇందులో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, అత్యాధునిక రిఫైనరీ మరియు నీటి పునర్వినియోగం (Water Recycling) వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది సిద్దిపేటతో పాటు యాదాద్రి భువనగరి, జనగామ, మహబూబాబాద్, గద్వాల్, నారాయణపేట జిల్లాల రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది.
గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ప్రభుత్వం కేవలం IIOPR (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్) ధృవీకరించిన మేలురకం మొక్కలను మాత్రమే సరఫరా చేస్తోంది.
ప్రభుత్వ రాయితీలు: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, ఇతరులకు 90% డ్రిప్ రాయితీనిస్తోంది. అలాగే, మొక్కలు నాటిన మొదటి నాలుగేళ్లలో నిర్వహణ కోసం ఎకరానికి సుమారు ₹52,000 వరకు రాయితీ నేరుగా రైతుల ఖాతాల్లోకి (DBT) జమ చేయబడుతోంది.
ముగింపు
తెలంగాణను 'ఆయిల్ పామ్ హబ్'గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల రైతులు అద్భుతంగా స్పందిస్తున్నారు. ప్రైవేటు సంస్థల వైఫల్యం తర్వాత పగ్గాలు చేపట్టిన ఆయిల్ ఫెడ్, నర్మెట్ట మరియు బీచుపల్లి ఫ్యాక్టరీల ఎర్పాటు ద్వారా పారిశ్రామిక తోడ్పాటును అందిస్తోంది. జర్నలిజం సమాచారాన్ని విశ్లేషిస్తే, లైజనింగ్ వ్యవస్థ దాన్ని అమలులోకి తెస్తుంది. ఈ రెండింటి సమన్వయంతో తెలంగాణ రైతు పాలిట ఆయిల్ పామ్ సాగు నిజమైన 'అక్షయ పాత్ర'గా నిలవబోతోంది.
బండి దుర్గా ప్రసాద్
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మరియు తెలంగాణ ఆయిల్ ఫెడ్ లైజనింగ్ ఆఫీసర్) మోబైల్ నంబర్; 7981184205