తెలంగాణలో ‘ముందస్తు’ సంకేతాలు
ఒక్కో అడుగేస్తున్న గులాబీ పక్షం
ప్రతిపక్షాలను మభ్యపెట్టే ప్రయత్నం?
ప్రజావ్యతిరేకత పై నీళ్ళు చల్లే ప్లాన్
ఎలక్షన్ స్టాటజిస్ట్ పీకే సహకారం
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల బడ్జెట్
ఉద్యోగభర్తీకి సర్కార్ కీలక నిర్ణయం ?
వేకువ ప్రత్యేక ప్రతినిధి: గతంలో మాదిరి మరోసారి కేసీఆర్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళుతారంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు విపక్ష నాయకులు పదేపదే అంటున్నారు. మొదట కేసీఆర్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరైనా బుద్దున్నోళ్ళు పాలనంతా సవ్యంగా జరుగుతున్నపుడు ముందస్తు ఎన్నికలకు పోతారా? అంటూ విమర్శించారు. పైగా తమకు మ రో రెండేళ్ళు పాలించే అవకాశం ఉండగా ఎందుకు వదులుకుంటామంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, గత రెండు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ప్రణాళిక ప్రకారం కేసీఆర్ ఒక్కో అడుగువేస్తున్నట్లు భావిస్తున్నారు. ముందస్తుకు కప్పిన ముసుగు నెమ్మదిగా తొలగిపోతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమైతున్నాయి.
ముందస్తు పైన కేసీఆర్ తిరకాసు
కేసీఆర్ ఔనంటే కాదని, కాదంటే ఔనని రాజకీయ పండితులు ఏ రూపంలో చెప్పినా ఇదే నిజమని పిస్తుందీ. సాధారణంగా కేసీఆర్ తనను ప్రశ్నించేందుకు ఎవరికీ అవకాశం దక్కనివ్వరు.తెలిసో తెలియక ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడికి దిగడం సైతం రాజకీయ ఓనమాల దశలో నేర్చుకున్నట్లున్నారు. తమ విధానమంతా ‘బాజాప్తా’ అని ఆయన బహిరంగా ఉద్ఘాటించగలరు. ‘నేనెందుకు అట్ల చెప్పిన్నానయా’... నీకేమన్నా ధమాక్ ఉందా? అని మాట మార్చి ఎదుటివారిని దబాయించగలరు. అదే ఆయన నోట తామేమన్నా మఠం నడుపుతున్నామా? మాదీ రాజకీయ పార్టీ...రాజకీయ పార్టీ అన్నపుడు మంచీచెడులూ...చెప్పేవీ ఉంటాయి. చెప్పకూడనవీ ఉంటాయీ. ఎన్నో మతలబులుంటాయంటూ సమర్ధించుకునే సాహసం ఆయనే చేస్తారు. మాటతప్పను మడమ తిప్పనంటూ మనం నోళ్ళుమూసుకునేలా మనకే సవాల్ విసురుతూ మెడమీద తలనరుక్కుంటానంటూ పదేపదే గుర్తు చేస్తారు. గమ్మతేమిటంటే ఎదుటి వారేమనుకుంటారనేది ఆయన పట్టించుకోరు. పైగా ప్రజల ‘ మెమెరీ’ పైన ఆయనకు అపారమైన విశ్వాసం. వాళ్ళు ఏదైనా మరిచిపోతారని లేకుంటే మాటలతో మై మరిపించవచ్చని కేసీఆర్ భావిస్తారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే నిన్నమొన్నటి ముందస్తు ఎన్నికలంటే సీఎం కోపంతో ఊగిపోయారు. కానీ, భిన్నమైన సంకేతాలు రాష్ట్రంలో కన్పిస్తున్నాయి. ప్రతిపక్షాలకు చిన్న అవకాశం సైతం రాకుండా కేసీఆర్ ప్లాన్ ప్రకారం పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. విపక్షాలు తేరుకునేలోపు తామ పథకం పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ప్రజావ్యతిరేకత తగ్గించే చర్యలు
ముందుగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం పైన నెలకొన్న ప్రజావ్యతిరేకతను తగ్గించే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏడున్నరేళ్ళ తమ దోస్తీ కాదని బీజేపీతో అమీతుమీ అంటూ వీరవిహారం చేస్తున్నారు. జాతీయ రాజకీయాలు, దేశాభివృద్ధి అంశాలెత్తుకున్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనలూ, సీఎంలతో భేటీలు నిర్వహిస్తూనే ఏకకాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ జిల్లాలవారీగా వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇంకో వైపు కుమారుడు మంత్రి కేటీఆర్, అల్లుడు మంత్రి హరీష్‌రావులు బాధ్యతలు పంచుకున్నట్లు వరుస ప్రారంభోత్సవాల పేరుతో జిల్లా పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి అంతటా భారీ సభలు నిర్వహిస్తున్నారు. ఇంకో వైపు పథకాలను ‘బంధు’లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ముందస్తు ఎన్నికల బడ్జెట్
బడ్జెట్లో కొత్తగా మరో ఏడు పథకాలు ప్రవేశపెట్టారు. దళితబంధు లాంటి వాటికి ప్రాధాన్యనివ్వడం గమనార్హం. మరో వైపు జిల్లాల్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఎన్నికల తరహా ఆయా ప్రాంతాలకు నిధులు ప్రకటిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో జరిగిన సభలో ఎన్నికల ప్రచార సభ తీరు వచ్చే ఎన్నకల్లో మంత్రి నిరంజన్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరడం గమనార్హం. రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే పూర్తి ముందస్తు ఎన్నికల బడ్జెట్‌గా మారిపోయింది. సంక్షేమానికి ప్రాధాన్యత, వరాలను గమనిస్తే ఓటుబ్యాంకు రక్షణ చర్యలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. బడ్జెట్లో కొత్తగా మరో ఏడు పథకాలు ప్రవేశపెట్టారు. దళితబంధు లాంటి వాటికి ప్రాధాన్యనివ్వడం గమనార్హం.
ఎన్నికలకు పూర్వ రంగం సిద్ధం
దీంతో పాటు బుధవారం అసెంబ్లీలో నిరుద్యోగుల అంశం పై కీలక ప్రకటన చేస్తానంటూ వనపర్తి సభలో సీఎం ప్రకటించడం గమనార్హం. అంటే ఉద్యోగ భర్తీ గురించి ప్రకటించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రకటించినట్లు నిరుద్యోగ భృతిపైన ఏమైనా ప్రకటన చేస్తారా? అనే అభిప్రాయాలు వ్యక్తమైతున్నాయి. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోయినా ఇంకా బడ్జెట్ పూర్తి స్థాయిలో మార్పుకానందున సంచలనం కోసం ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో వేగంగా అధికార కేంద్రంగా సాగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమైతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనా నిజం కాకుంటే ప్రతిపక్షాలకు కనీస అవకాశం దక్కకుండా అధికార గొంతు ప్రజల్లోకి తీసుకవెళ్ళే ప్రణాళికైనా ఇందులో ఇమిడి ఉంటుందని భావించాల్సి ఉంటుంది. ఇంకో వైపు పీకే లాంటి ఎన్నికల వ్యూహకర్తల సహకారం తీసుకోవడం మరోక ప్రత్యేకాంశంగా భావించాలి. పీకేలాంటి వారిని పలువరు విమర్శిస్తున్నప్పటికీ దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఈ వ్యూహంలో చిక్కుకుంటూనే ఉన్నారు. దీన్ని కూడా అంతసులభంగా తీసిపారేయాల్సిన అంశం కాదేమో?