‘ ముందస్తు’ పద్దు

‘ ముందస్తు’  పద్దు

రూ.2.56లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ 

రుణాలు రూ. 53,970 కోట్లు

అప్పు భారంలో అభివృద్ధి రాష్ట్రం

అప్పు రూ. 3,29,998కోట్లు

గవర్నర్​ రాకుండా,  విపక్షాలు లేకుండా సమావేశం


వేకువ ప్రత్యేక ప్రతినిధి:  అధికార పక్షం బహిరంగంగా చెప్పనప్పటికీ రాష్ట్రంలో రానున్న ముందస్తు ఎన్నికలకు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్​గా అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ బడ్జెట్​ను పరోక్షంగా ఎన్నికల బడ్జెట్​గా పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆధ్వర్యంలో ఎంతో కసరత్తు చేసిన తర్వాత బడ్జెట్​ను కేబినేట్​ ఆమోదించి సోమవారం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు ప్రవేశపెట్టారు. గత బడ్జెట్​తో పోల్చితే దాదాపు రూ. 30వేల కోట్ల అదనపు అంచనాతో బడ్జెట్​ను ప్రవేశపెట్టడం గమనార్హం. రూ. 2లక్షల56వేల కోట్లకు పైగా అంచనాతో 2022–23 వార్షిక బడ్జెట్​ను అట్టహాసంగా ప్రవేశపెట్టారు.  మూడో దఫా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలసిన కేసీఆర్​ ఈ మేరకు రాజకీయ వ్యూహాలకుతోడు, బడ్జెట్​లను కూడా ఇదేస్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన బడ్జెట్​గా చూడాల్సిన అవశ్యకత ఉంది. 

 గవర్నర్​ రాకుండా..విపక్షాలు లేకుండా

రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలకు రాష్ట్ర గవర్నర్​ తమిళసై రాకుండా నిబంధనల పేరుతో ప్రభుత్వం ప్రయత్నించింది. బీజేపీ వర్సెస్​ టీఆర్​ఎస్​ అనే తీరులో బడ్జెట్​ ప్రసంగంలో హరీశ్​ ​రావు కేంద్రం పై విమర్శలు లేవనెత్తారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేసిన బీజేపీ ఎమ్మేల్యేలు ఈటల, రఘునందన్​రావు, రాజాసింగ్​ను మొత్తం సెషన్​ ముగిసే వరకు సస్పెండ్​ చేయడం గమనార్హం. ఇక పాయింటాఫ్​ ఆర్డర్​కు కూడా స్పీకర్​ శ్రీనివాసరెడ్డి అవకాశమివ్వలేదంటూ కాంగ్రెస్​ సభను వాకౌట్​ చేసింది. మొత్తంగా తమ దోస్తీ ఎంఐఎం మిత్రులు మినహా విపక్షాల వాసన లేకుండానే బడ్జెట్​ ప్రవేశపెట్టింది. బడ్జెట్​ ప్రవేశపెట్టిన సందర్భంగా హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన భారీ భద్రత, విపక్షాల గొంతు నొక్కడం పై మండిపడుతున్నారు. రాష్ట్రంలో నియంతృత్వపాలన సాగుతుందని నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ, టీఆర్​ఎస్​ కలిసి నాటకాలు చేస్తున్నాయని కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ​ విమర్శించారు. 

 రూ.2.56లక్షల కోట్లతో రాష్ట్ర  బడ్జెట్ 

రాష్ట్ర శాసనసభలో 22– 23 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక  మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్​ రూ. 2,56,958.51 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29,728.44  కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర జీ​డీపీ వృద్ధి రేటు 11.1 శాతంగా అంచనా వేశారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 19.14 శాతంగా దేశ జీడీపీలో 4.97 శాతానికి తెలంగాణ వాటా పెరిగినట్లు పేర్కొన్నారు. 2021-–22 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,78,833 కోట్లుగా తెలిపారు. రాష్ట్రంలో పన్ను ఆదాయం రూ.1,08,211.93 కోట్లు ఉంటుందని,  కేంద్ర పన్నుల్లో వాటా రూ.18,394.11 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 25,421.63 కోట్లు,  గ్రాంట్లు రూ. 41,001.73కోట్లు,  రుణాలు రూ. 53,970 కోట్లుగా ఉంటుందని తెలిపారు.  2022-–23 నాటికి మొత్తం అప్పులు రూ. 3,29,998కోట్ల భారంగా మారనున్నది.ఈ అప్పులు జీఎస్టీపీలో 25 శాతానికి చేరుకోనున్నాయి. 

భూ అమ్మకాలు...అందినకాడికీ అప్పులు 

రోజురోజుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తున్నది. అమ్మకం పన్ను ద్వారా అంచనా రూ. 33,000 కోట్లు. ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం 15,600కోట్లుగా అంచనా వేశారు. కేంద్ర గ్రాంట్లు ద్వారా రాష్ట్ర వాటా లభిస్తున్నా భారీ అంచనాలతో ప్రజాకర్షకంగా రూపొందిస్తున బడ్జెట్ల వల్ల రుణాల పై ఆధారపడుతున్నారు. రుణాల పరిమితి తలకుమించిన భారమైతున్నందున ఆస్తుల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. ​ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి అధికారాన్ని రక్షించుకుంటున్నది. రాష్ట్రంలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వం దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకానికి సిద్ధమైంది. దీనికి తోడు వివిధ సంస్థల ద్వారా రిజర్వు బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఇబ్బడిముబ్బడిగా అప్పులు సమకూర్చుకుంటున్నారు. ప్రజలపై విపరీతమైన భారం పెరుగున్నది. ఈ అప్పుల చెల్లింపులూ, అదనపు వడ్డీలకు బడ్జెట్​లో మోతదుకు మించిన వాటాల చెల్లింపులు జరిగిపోతున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. పైగా ధనిక రాష్ట్రంగా పదేపదే ఆర్భాటంగా ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్​ను ఈ అప్పులు, అమ్మకాలపై ప్రశ్నించడమే నేరంగా భావిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై విరుచుకపడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలో? తెలియని రాజకీయ పార్టీలు తమను విమర్శిస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటికే అదనపు ఆదాయం కోసం రాజధానిలో విలువైన భూములను అయినవారికి తక్కువ ధరకు అప్పగిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల భూ వేలం పై కొందరు కోర్టును సైతం ఆశ్రయించారు. విడతల వారీగా భూ విక్రయాలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 

 ముందస్తు ఎన్నికల బడ్జెట్​ 

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్​ ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. అందుకే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించారు. ఇదే గత ఎన్నికల మేనిఫెస్టోల ప్రవేశపెట్టిన అనేక హామీలను విస్మరించారు. దీనిలో భాగంగానే దళిత బంధుకు రూ.17,700 కోట్లు ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వైద్యకళాశాల ఏర్పాటు పెద్ద డిమాండ్​గా మారడంతో 7 కొత్త వైద్య కళాశాలలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. మిగిలిన వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామంటూ ముందస్తు హామీ ఇచ్చారు. పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు, పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు, అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు, రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ, వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ, పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీతో పాటు పామాయిల్ సాగుకు రూ. వెయ్యి కోట్లు, రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రకటించారు.

 టూ బెడ్​ రూమ్​కు ఆర్థిక సాయం

సర్కారే రెండు పడకగదుల నిర్మాణాన్ని చేపడుతామన్న హామీ నుంచి గత ఎన్నికల మేనిఫెస్టోలో సొంత జాగా ఉన్న వారికి రూ. 5లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన హామీని కుదించి రూ. 3లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.  ఇక వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు, హరితహారానికి రూ.932 కోట్లు, సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్తలబ్దిదారులకు ఆసరా పింఛన్లు, ఆసరా పింఛన్లకురూ.11.728 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ..50కోట్లు, 112 కులాల సమూహామైన బీసీలకు రూ. 5698 కోట్లు కేటాయించగా బ్రాహ్మణ సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించారు.  రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్ నిర్వహణ రూ.1.542 కోట్లు. పోలీసు శాఖకు రూ.9,315 కోట్లు,  యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి చేపట్టనున్నట్లు ప్రకటించారు. గిరిజన గ్రామ పంచాయతీల భవనాలు నిర్మాణానికి రూ.600 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.12,565 కోట్లు, రీజినల్ రింగ్ రోడ్కు రూ.500 కోట్లు, సచివాల భవనాల నిర్మానానికి రూ.400 కోట్లు కేటాయించారు.  గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి అంశానికి బడ్జెట్​లో స్థానం దక్కలేదు.

Newsletter