కాంగ్రెస్‌లో కదలిక ప్రారంభం
– రైతు సంఘర్షణ సభతో ఉత్సాహం
– రాహుల్ రాకతో నేతల్లో పట్టుదల
– కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త సంతోషం
– ఉస్మానియా ఘటనతో ఆగ్రహం
– చైతన్యం చేయడంలో వెనుకంజ
– ఎస్సీ,ఎస్టీ, బీసీలపై కేంద్రీకరిస్తే ఫలితం
ప్రత్యేక ప్రతినిధి: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో కొత్త కదలిక ప్రారంభమైంది. నిన్నమొన్నటి వరకు నిస్తేజంగా, ఎవరికి వారు యమునా తీరు అనే చందంగా వ్యవహరించిన పార్టీ నాయకుల్లో స్పందన పెరిగింది. ఇంతకాలం అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా తాజా రైతు సంఘర్షణ సభ పుణ్యమా అంటూ రాష్ట్రస్థాయి ప్రధాన లీడర్లంతా తామున్నామంటూ ఎవరికి వారు తలెత్తుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకుంటూనే పార్టీలో తమ పరపతి తగ్గిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు. చాలా కాలానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టడంతో లోపాలెన్ని ఉన్నా పార్టీలో నూతన ఉత్తేజం కన్పిస్తోంది. అనివార్యంగా నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ పాలనను, ఆ పార్టీ నేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే కేంద్రంలో ప్రధాని మోడీ, బీజేపీ పాలనపై మండిపడుతున్నారు. రెండు అధికారపార్టీల పై రాష్ట స్థాయి నాయకులు దుమ్మెత్తిపోయడంతో కేడర్‌లో నూతన ఉత్సాహం కన్పిస్తోంది.
– లీడర్లలో విభేదాలున్నా ఐక్యతారాగం
ఎనిమిదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కుదుపులు, ఎత్తుపల్లాల మధ్య అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తాజా కార్యక్రమంతో రాష్ట్రస్థాయిలో ఒకే గొంతుకై నాయకులు అధికార పార్టీలపై మండిపడుతున్నారు. రెండు పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయారు. ఈ విషయంలో పార్టీ కేడర్‌లో కాస్త నిరాశ నెలకొంది. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ప్రజాసమస్యలపై కార్యక్రమాలు, నిరసనలు కొనసాగించారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించినప్పటికీ అవన్నీ జిల్లా స్థాయిలోనే జరిగాయి. ఈ సందర్భంగా నాయకుల మధ్య విభేదాలు, గొడవలు పొడసూపినప్పటికీ పార్టీలో కదలిక వచ్చింది. ఇవన్నీ జిల్లాలకే పరిమితమయ్యాయి. తాజా రైతు సంఘర్షణ సభను రాష్ట్రస్థాయిలోనే అధికార పార్టీలకు సవాల్‌గా నిర్వహించేందుకు నిర్ణయించడంతో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా తమ తమ ఆధిపత్యాలు చాటుకునేందుకైనా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ముందుకు కదులుతున్నారు. పైగా ఈ సభకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నందున నాయకులకు పరీక్షగా మారింది. భారీ స్థాయిలో సభ నిర్వహించి పార్టీలో కొత్త ఉత్సహానికి ఈ సభ ద్వారా నాంది పలకాలని భావిస్తున్నారు. ఈ సభ తదుపరి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా పావులు కదపాలని యోచిస్తున్నారు. ఈ కారణంగా పార్టీలోని ముఖ్యనాయకులంతా ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలపై గొంతువిప్పుతున్నారు.
– గొంతెత్తుతున్న ముఖ్యనేతలు
కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతెత్తుతున్నారు. నిన్నమొన్నటి వరకు వినిపించని స్వరాలు కూడా కొంత పెద్దవి చేసి కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ సభ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ జిల్లాల పర్యటనలు, కేడర్ సమావేశాలు ఆ పార్టీలో కదలికను పెంచాయి. రాష్ట్రంలోని కీలక నేతలు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, సీనియర్ నేత హన్మంతరావులు తమదైన తీరులో ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు తమతమ జిల్లాలకే పరిమితమైన నాయకులు గ్రూపులుగానైనా భారీ సభ నిర్వహించే వరంగల్‌ను సందర్శిస్తున్నారు. వరంగల్ కేంద్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సభా స్థలి ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని ఇప్పటికే పార్టీ ముఖ్యనాయకులంతా సందర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలు ధనసరి అనసూయ, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు భాగస్వామ్యమవుతున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలలో పరిధిలో పార్టీలో కూడా కదలిక పెరిగింది. నాయకుల రాకతో సంతోషం వ్యక్తమైతోంది. ఇదే సమయంలో పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్కం టాగూర్, పరిశీలకులు బోసురాజు, శ్రీనివాస్‌లు సైతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఏమైనా పార్టీ నాయకులకు ఈ నెల 6వ తేదీ వరకు చేతినిండా పనిపడిందని చెప్పవచ్చు. ఈ సభ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో జనసమీకరణ జరిగితే ఆ పార్టీకి కొత్త ఊపిరులూదినట్లేనని చెప్పవచ్చు.
– రాహుల్.... ఉస్మానియా ట్విస్టు
రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సీటిని సందర్శించడానికి వర్సిటీ పాలకవర్గం అనుమతినిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ పై ప్రభుత్వ పెత్తనానికి నిదర్శనంగా చెబుతున్నారు. వర్సిటీలకు ఉన్న స్వయంప్రతిపత్తిని దెబ్బదీసేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులపట్ల, టీఆర్ఎస్ పట్ల ఇదే రీతిలో వ్యవహరిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండేదని ప్రశ్నిస్తున్నారు. వర్సిటీలను నీరుగార్చి వీసీలను తోలుబొమ్మలుగా మార్చారని అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నేతకు వర్సిటీలో అనుమతి నిరాకరించడం ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు బాల్కసుమన్ లాంటి చోటా లీడర్ల హంగామాను ప్రజాస్వామిక వాదులు దుయ్యబడుతున్నారు. టీఆర్ఎస్ అధికార అహంకారం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమైతున్నది. ఈ విషయంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు. విద్యార్ధి సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా టీఆర్ఎస్ తీరును పలువురు మేధావులు ఆకేపిస్తున్నారు. ఈ అంశంలో కోర్టును సైతం ఆశ్రయించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే టీఆర్ఎస్ ఈవిషయంలో సెల్ఫ్‌గోల్ చేసుకుందని, కాంగ్రెస్ పట్ల సానుభూతి పెరుగుతోందని భావిస్తున్నారు.
– పర్యటనలు సరే ప్రజల వద్దకు వద్దా?
వరంగల్ భారీ సభ నేపథ్యంలో గత 15 రోజుల నుంచి వచ్చిన నేత రాకుండా హైదరాబాద్ టూ వరంగల్ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ తెలంగాణ ఇంచార్జ్తో మాణిక్కం టాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు రాష్ట్రంలోని ముఖ్యనాయకులంతా వరంగల్‌ను సందర్శించారు. వరంగల్ కేడర్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కేడర్‌లో ఆనందం నెలకొన్నప్పటికీ నాయకులంతా సభ మైదానాన్ని సందర్శించి ఓ ప్రెస్‌మీట్ పెట్టి వెళుతున్నారు. ఈ మేరకు బాగానే ఉంది. కానీ, గ్రౌండ్ ఏమైనా పెరిగేదే తగ్గేదా? వచ్చే నాయకులు చుట్టుపక్కల జిల్లాలోని నియోజకవర్గాల్లో కేడర్ సమావేశం ఇదే సమిష్టి స్పూర్తితో నిర్వహించిఉత్సహాన్ని నింపినా బాగుండేది. లేకుంటే రైతులు, ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వ తీరుపై మాటమాత్రంగానైనా చెప్పి ప్రజల్లో చర్చను లేపితే బాగుండేదికానీ గుంపులుగా రావడం, పోవడం చేస్తున్నారనే విమర్శలున్నాయి. సభను సక్సెస్ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.
– పునాది శక్తులపై కేంద్రీకరిస్తే ఫలితం
రైతాంగ సమస్యలతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రజాసమస్యలపై ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ, బీసీలు కేంద్రంగా చేసుకుని పార్టీ టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తే వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయని చెబుతున్నారు. ఈ దిశగా పార్టీ ప్రధాన నాయకత్వం కేంద్రీకరిస్తే సానుకూల ఫలితాలొస్తాయని భావిస్తున్నారు. ఎందుకంటే నిర్లక్ష్యానికి గురైన ఈ సెక్షన్ తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. వీటికి కాంగ్రెస్ అండగా నిలిస్తే తమ పాత పునాదులు మళ్ళీ చిగుర్లువేసే అవకాశం ఉంటుంది.
––––––––––