తెలంగాణలో అధికార ‘పార్టీల’ ఆట

తెలంగాణలో అధికార ‘పార్టీల’ ఆట

కొత్త రాజకీయ పావులెవ్వరు?

బీజేపీకీ  అంత సీన్​ ఉందా!

కమలం ప్రత్యమ్నాయమా?

ఐదేళ్ళలో అంత బలపడిందా!


ప్రత్యేక ప్రతినిధి: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం కోసం ప్రధాన పార్టీలు అడుతున్న ఆటలో పావులెవరైతారనేది హాట్​టాపిక్​గా మారింది. టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంటుందనేది అందరికీ స్పష్టం. ఈ మూడు పార్టీలకు బీఎస్పీ, ఆప్​ పక్షాలు సైతం తోడుకానున్నాయి. అధికార టీఆర్​ఎస్​కు కాంగ్రెస్​, బీజేపీల్లో ఎవరు ప్రత్యామ్నాయమనేది ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నారు. రెండు పర్యాయాలుగా రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న టీఆర్​ఎస్​ పార్టీ మూడవ సారి  తన పట్టునిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రెండు పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీఆర్​ఎస్​కు తామే ప్రత్యామ్నాయమని, రాష్ట్రంలో అధికారం తమదేనంటూ జబ్బలు చరుస్తున్నారు. ఇక కాంగ్రెస్​ నాయకులు వచ్చే ఎన్నికల్లో హస్తానిదే హవా అంటూ ప్రకటిస్తున్నారు. చాలా కాలం దోస్తీ చేసిన అంశాన్ని పక్కన పెట్టి ఇటీవల బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్య ఉప్పూనిప్పూ అనే తీరుతో పరస్పరం తీవ్ర విమర్శలు, దూషణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  మూడు పక్షాల భవిష్యత్​ను రాష్ట్ర ప్రజలే తేలుస్తారు. కానీ, తాజా పరిస్థితుల్లో బీజేపీ వాదనలో ఎంత నిజమందనేది రేఖామాత్రంగా పరిశీలిద్దాం. 


– బీజేపీకి ఆదరణ లభిస్తుందా? 


ఇటీవల జరిగిన యుపీ, ఉత్తరాఖండ్​, పంజాబ్​, మణిపూర్​, గోవా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతరాజకీయ పరిస్థితిల్లో మార్పులుంటాయనేది వాస్తమమైనప్పటికీ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల తీరులో ఏమైనా మార్పులుంటాయా? వేచి చూడాల్సిందే. రెండేళ్ళుగా బీజేపీ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్​ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులను ఆకర్షించి చేరికలను ప్రోత్సహించారు. తాజాగా టీఆర్​ఎస్ అసమ్మతివాదులపై దృష్టిపెట్టినట్లు భావిస్తున్నారు. బీజేపీ తన దూకుడును మరింత పెంచుతోందని భావిస్తున్నారు. ఈ రెండు నెలల కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యుపీ సీఎం యోగీ, హోంమంత్రి అమిత్​షా తెలంగాణలో పర్యటిస్తారని, తెలంగాణను లక్ష్యంగా ఎంచుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర తిరిగి వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిజర్వుడు లోక్​సభ నియోజకవర్గాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. వ్యూహాత్మకంగా బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఊహిస్తున్నట్లు తెలంగాణ ప్రజలు కమలాన్ని ఆదరించి అక్కున చేర్చుకుంటారా? 


–  కేంద్ర ప్రభుత్వ వైఫల్యమెంత?  


బీజేపీ నేతలు ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ కేంద్రంలో అధికార పార్టీగా రాష్ట్రానికి ఏం చేశారనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో చెలాయిస్తున్నా తెలంగాణ అభివృద్ధిలో ఆ పార్టీ ప్రభుత్వ ముద్ర పెద్దగా లేదని చెప్చవచ్చు.  తాము కేంద్రం నుంచి అన్ని పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పే మాటలు నాయకులకు సంతృప్తి నివ్వచ్చేమోగానీ, ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు దోహదం చేస్తాయనేది అనుమానం. రేపు ఎన్నికల్లో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​తో పాటు అన్ని విపక్షాలు బీజేపీని నిలదీస్తాయి. ఇప్పటి వరకు బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలెంత మేరకు అమలు చేశారనేది ప్రశ్నిస్తారు. ఏడాది కోటి ఉద్యోగాలు, బ్లాక్​మనీ బయటితెస్తాం, అవినీతి రహిత ప్రభుత్వ హామీలన్నీ చర్చకు వస్తాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ప్రభావం, రైతులు, నిరుద్యోగులు, ఉపాధి లేక తల్లడిల్లుతున్న భారతావనికి బీజేపీ కారణమెంత అనేది ప్రజాక్షేత్రంలో తేల్చాల్సి ఉంటుంది. రకరకాల జిమ్మిక్కులు, ఎన్నికల సానుకూల ఫలితాల ఊపులో చెప్ప మాటలు ప్రతీసారి ఫలితాలిస్తాయని భావించకూడదు.


–  సమాధానం చెప్పాల్సిన  ప్రశ్నలు


తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రంలో అధికారంలోకి రాగానే బీజేపీ ఏడు మండలాలను ఏపీలో చేర్చి తీరని అన్యాయం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ, గిరిజనవర్సిటీ, బయ్యారం ఉక్కుల అడ్రస్సేలేదు. తెలంగాణలో చేపట్టిన ఇరిగేషన్​ ప్రాజెక్టుల్లో ఒక్కదానికి జాతీయ హోదా రాలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శలున్నాయి. హైదరాబాద్​లో వరదలొస్తే ఆదుకోలేదు. సింగరేణి ప్రైవేటీవకరణ ప్రయత్నం. ఐటిఐఆర్​ ప్రాజెక్టుకు అన్యాయం. జలవివాదాలకు పరిష్కరించకపోగా పీటముడేసే చర్యలు, పైగా తెరపైకి నదుల అనుసంధానం అనేక అంశాలకు జవాబుదారీగా నిలువాల్సిన అవసరం తప్పక ఉంటోంది. ప్రజలను సంతృప్తి పరిచి వారిని గెలుచుకోవడం అంత సులువైన అంశమేమికాదు. ఇంతకాలం టీఆర్​ఎస్​తో అంటకాగిన అంశం ప్రజల మనోఫలకం నుంచి తొలగించలేరు. 


– బీజేపీ బలం అంతగా పెరిగిందా? 


బీజేపీ అనుకూల వాతవారణం, జాతీయ స్థాయిలో నేతల చరిష్మా, తాజా ఫలితాల సానుకూలత, పార్టీలో చేరికలతో ఇటీవల రాష్ట్రంలో ఆ పార్టీ బలం కొంత పెరిగిన మాట వాస్తమే. హైదరాబాద్​, దుబ్బాక, హుజురాబాద్​ ఎన్నికల సానుకూల ఫలితాలు ఉత్సాహాన్నిచ్చాయి. ఈ పాజిటీవ్​ అంశాలతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బలమైన టీఆర్​ఎస్​ పార్టీనిని ఓడించి అధికారంలో వస్తుందా? అనేది ప్రశ్నార్ధకం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్​ కంటే బలమైన పార్టీగా బీజేపీ ఇంకా అవతరించిందా? అనేది పెద్ద అనుమానం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ 2018 ఎన్నికల నాటి పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలుండగా 2018 ఎన్నికల్లో ఒకే ఎమ్మెల్యే స్థానం దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేయడం గమనార్హం. పలుచోట్ల డిపాజిట్​ రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 14,50, 456 ఓట్లు రాగా 7శాతం ఓట్లు పొందారు.  తర్వాత 2019లో వచ్చిన లోక్​సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్​ పార్టీకి 28.4శాతం ఓట్లు రావడం గమనార్హం.  అధికార టీఆర్​ఎస్​ పై నెలకొన్న ప్రజావ్యతిరేకత, కాంగ్రెస్​ స్వయంకృతం తోడై  వ్యతిరేకత వెల్లువగా మారి అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప  తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడం బీజేపీకి అంత సులభమైన అంశం మాత్రం కాదు.

Newsletter