రైతన్నను నమ్మించేందుకు సర్కారు జిమ్మిక్కు
రైతన్నను నమ్మించేందుకు సర్కారు జిమ్మిక్కు
౼ బిగుసుకున్న ల్యాండ్ పోలింగ్ ఉచ్చు
౼ జీవో రద్దు చేయాలంటున్న రైతు జేఏసీ
౼ రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
౼ నోటిఫికేషన్ రద్దుకు కుడాకు ఆదేశాలు
౼ ఆగమేఘాల మీద ప్రజాప్రతినిధుల మీటింగ్
౼ హాజరైన మంత్రి ఎర్రబెల్లి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ,అధికారులు
౼ రెడీమేడ్ పాలాభిషేకాలు
౼ జీవో రద్దు ఊసెత్తని మంత్రి
(ప్రత్యేక ప్రతినిధి):రైతుల చెవుల్లో పెద్ద పెద్ద గులాబీ పూలు పెట్టేందుకు అధికార పార్టీ మరోసారి సిద్ధమైంది. రైతన్నను నమ్మించేందుకు సాక్షాత్తు సర్కారు జిమ్మిక్కు సిద్ధమైంది. విచిత్రమేమిటంటే వేరెవరో నిర్ణయం చేస్తే ఆ తప్పుడు నిర్ణయాన్ని సమీక్షించి జరిగిన పొరపాటును సరిదిద్దినట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే బిల్డప్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. నిజానికి వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)పరిధి లో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం జారీ చేసిన GO MS No. 80MA&UD 2018 ఆధారంగా కుడా తన పరిధిలో పూలింగ్ చేపట్టేందుకు సిద్ధమైంది. వరంగల్ ఔటర్ రింగురోడ్డు చుట్టూ 41 కిలోమీటర్ల పరిధిలో లోని 27 గ్రామాలలో సుమారు 21వేల ఎకరాల రైతుల భూమిని పూలింగ్ ద్వారా సమీకరించాలని అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కథంతా రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్లోనే సాగిందనేది అందరికి తెలిసిన విషయం.
సమర్ధించిన మంత్రి కేటీఆర్
స్వయంగా రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ల్యాండ్ పూలింగ్ అంశం లేవనెత్తిన సందర్భంలో ఆయన స్పందిస్తూ 'ఇందులో తప్పేముంది' అంటూ కుడా నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. కాకుంటే రైతులు తన ఇష్టపూర్తిగా భూములు ఇస్తేనే కూడా తీసుకుంటుందని స్పష్టం చేశారు.
సంబంధలేనట్లు డ్రామా
కానీ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం ఆకాశంలో జరిగినట్టు రాష్ట్రానికి, కుడాకు, జిల్లా ప్రజాప్రతినిధులకు అస్సలు సంబంధం లేనట్లు మాట్లాడడం విడ్డూరం. తాము చేసిన పొరపాటును బహిరంగంగా ఒప్పుకోవడానికి ఈగో అడ్డం వచ్చినట్లు ఉంది. పైగా రైతుల న్యాయమైన ఆవేదనను ఆందోళనను గుర్తించకుండా, దానికి రాజకీయ రంగు పూసి తమ పబ్బం గడుపు కునేందుకు అధికార పార్టీ మరోసారి ప్రయత్నించిందనేది స్పష్టంగా అర్థమవుతోంది.
మిస్ ఫైరైన ల్యాండ్ పూలింగ్
కుడా పరిధిలో భారీ స్థాయిలో ప్రభుత్వ కనుసన్నల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో చేపట్టాలనుకున్న ల్యాండ్ పూలింగ్ మిస్‌ఫైర్ అయింది.
మూడు జిల్లాలైన వరంగల్, హనుమకొండ, జనగామ పరిధిలోని 27 గ్రామాల్లో ఇరవై ఒక్క వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించడం పట్ల రైతుల్లో సహజంగానే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, అధికారులకు వినతి పత్రాలు, ప్రజాప్రతినిధులకు విన్నపాలు చేసిన అనంతరం తగిన రీతిలో కుడా నుంచి కానీ, జిల్లా యంత్రాంగాల నుంచి కానీ, జిల్లా ప్రజా ప్రతినిధులు నుంచి కానీ, సరైన స్పందన రాలేదు. పైగా రైతులను మభ్య పెట్టి, మాయ చేసి ల్యాండ్ పూలింగ్ ను చేపట్టాలని భావించారు. రైతులపై ఒత్తిడి తెచ్చి నానారకాలుగా నయానా భయానా పూలింగ్ కొనసాగించాలని భావించారు. కానీ ఈ నిర్ణయాన్ని రైతులు ఐక్యంగా సంఘటితమై వ్యతిరేకించారు. రైతుల నిరసనలకు రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ తో పాటు ప్రజా సంఘాలు సైతం సంపూర్ణ మద్దతు నందించాయి. రైతులు స్వచ్ఛందంగా ఐక్య కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేసి ఆందోళనను తీవ్రతరం చేశారు. రోజురోజుకు ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న విషయాన్ని గమనించిన అధికార పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
- కుడా ప్రకటనతో చల్లారని నిరసనలు
లాండ్ పూలింగ్ విషయంలో ముందుగా రైతులను మాయమాటలతో మభ్య పెట్టేందుకు యత్నించారు. ఈ పాచిక పారక పోవడంతో బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయిందని గుర్తించి ఆగమేఘాల మీద కుడా కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించి నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు కుడా చైర్మన్ సుందర్ రాజు ప్రకటించారు. కానీ కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్య ప్రకటనతో అసలు ఉద్దేశం బయటపడింది. నోటిఫికేషన్ను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నామని, రైతులకు నచ్చచెప్పిన అంతరం ల్యాండ్ పూలింగ్ను యధావిధిగా అమలు చేస్తామంటూ ప్రకటించారు. ఈ ప్రకటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయింది. ప్రజా ప్రతినిధులు, కుడా చైర్మన్ ప్రకటనల డొల్లతనం పట్ల రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
జీవో రద్దుకు రైతుల రాస్తారోకో
కుడా చేసిన డ్రామాలు, జిల్లా ప్రజా ప్రతినిధుల నాటకాలు గ్రహించిన రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ల్యాండ్ పూలింగ్ కోసం జారీచేసిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. అదే సమయంలో ల్యాండ్ పూలింగ్ కోసం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుడాతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులపై నమ్మకం కోల్పోయిన రైతులు మరోసారి ఆందోళన చేపట్టడంతో అధికార పార్టీ నాయకులు ఖంగుతిన్నారు.
రాస్తారోకో....అరెస్టులు
రైతు జేఏసీ జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా అరెస్టు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించి విఫలమైంది. ముఖ్యంగా ల్యాండ్ పోలింగ్ చేస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఈ నిరసనలు రాబోయే కాలంలో తమ ఓటు బ్యాంకుకు ఎసరు పెట్టే ప్రమాదం ఉందని గ్రహించి అధిష్టానాన్ని ఒప్పించేందుకు మరోసారి ప్రయత్నించారు. ఈ మేరకు ఆరూరి రమేష్ ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి మంత్రి కేటీఆర్ కు మరోసారి ఇక్కడి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన పరిధిలోని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కుడా అధికారులకు నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆదేశాలను తేదీ 30 మే 2౦22న జారీ చేశారు. చిత్రమేమిటంటే ఈ ఉత్తర్వుల్లో 2021 గా తప్పు నమోదయింది.
౼ నష్టనివారణ చర్యలు
ఇంతటితో ఊరుకుంటే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించిన గులాబీ పార్టీ మరోసారి మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో ఆగమేఘాల మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లా కలెక్టర్, కుడా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎదుటి రాజకీయ పక్షాల మీద బురద చల్లేందుకు మరోసారి ప్రయత్నించారు. ఆగమేఘాల మీద రెడీమేడ్ పాలాభిషేకం చేసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అయితే రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసినట్లు జీవో రద్దు జోలికి మాత్రం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశం వెళ్ళక పోవడం గమనార్హం.
౼ రైతులు వెనక్కి తగ్గేనా?
తాజా నిర్ణయంతో రైతులు ఆందోళన విరమిస్తారా? జీవో రద్దు చేసే వరకు నిరసనలు తెలియజేస్తారా? వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా రైతుల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఆగ్రహం, దానితోపాటు త్వరలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉన్నందున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని గుర్తించి హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఏ మేరకు ఈ నిర్ణయం అధికార పార్టీని కాపాడుతుందో చూడాల్సిందే. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకులు ఆశించిన 'పథకం' అర్ధాంతరంగా బెడిసికొట్టింది. అయితే రానున్న రోజుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడితే మళ్లీ ల్యాండ్ పూలింగ్ చేపడతారా? లేదా భవిష్యత్తులో తేలనుంది.
తప్పుడు తాత్కాలిక ప్రకటనలతో రైతుల జీవితలతో చెలగాటం ఆడవద్దు
జూన్ 3వ తేదీ నుండి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కోసం మంత్రులు ఎమ్మెల్యేలు, టిఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగాలి అంటే ల్యాండ్ పూలింగ్ జీఓ పై రైతులు ఉద్యమం చేస్తున్నారు. ప్రజల వద్దకు వెళితే తీవ్ర వెతిరేకత వస్తుంది కాబట్టి. ఎదో ఒక తప్పుడు ప్రకట చేసి రైతులను మభ్యపెట్టాలని చూస్తున్నారు. Form 1 ప్రక్రియ ను KUDA పరిధిలో ఇచ్చిన నోటిఫికేషన్ ను నిలిపివేస్తున్నాం అని ప్రెస్ నోట్ ఇచ్చారు . తప్ప ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం GO MS No. 80MA&UD 2018 ను రద్దుచేస్తున్నాం అని ప్రకటించలేదు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలానే ఆనాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన, ఆ తరువాత వెనక్కి తీసుకోవటం 1500 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు జారిగాయిఇప్పుడు కూడా ఇలాంటి తప్పుడు తాత్కాలిక ప్రకటనలతో రైతుల జీవితలతో చెలగాటం ఆడవద్దు
- రైతు ఐక్య కార్యాచరణ సమితి- ఉమ్మడి వరంగల్ జిల్లా