విభజన హామీలకు గ్రహణం


– రాష్ర్టాభివృద్ధికి  తూట్లు 

– ఏండ్లుగా పాలకుల సాగదీత 

– అధికార పార్టీల అలసత్వం 

–  ప్రజా ఒత్తిడితో పరిష్కారం 


వేకువ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన సందర్భంగా ముందు చూపుతో అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టరూపంలో ఇచ్చిన అభివృద్ధి హామీలకు రాజకీయగ్రహం పట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలుగా విభజించిన సమయంలో పురోభివృద్ధికి  అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం చట్టం రూపొందించింది. ఈ హామీలను పదేళ్ళ కాలపరిమితిలో అమలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించి పార్లమెంట్లో ఆమోదించారు. దీనికి అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సంపూర్ణ మద్ధతు తెలియజేసింది. కానీ, కానీ, బీజేపీ  అధికారంలోకి వచ్చిన ఇంతకాలం తర్వాత కూడా చట్టంలోని హామీలు అమలు చేయడకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. హామీలు అమలు చేయించుకోవడంలో  రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. 


–  కేంద్రం నిర్లక్ష్యం....రాష్ట్రం తాత్సర్యం


. కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యం, రాష్ట్రంలోని టీఆర్​ఎస్​ తాత్సర్యం రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారింది.  గత ఏడున్నరేండ్ల పాటు కేంద్రంలోని బీజేపీ సర్కారుతో  రాష్ట్రంలోని టీఆర్​ఎస్​  ప్రభుత్వ దోస్తీ సాఫీగా సాగింది. అయినా ఈ హామీలు అమలు చేయించుకోవడంలో టీఆర్​ఎస్ నాయకత్వం విఫలమైంది.  తమ రాజకీయ ప్రయోనాల చుట్టూ తిప్పుతూ రాష్ట్రాభివృద్ధికి తూట్లు పొడుస్తున్నది.  ప్రాంత ప్రయోజనాలు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు సైతం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్నందున అధికార పార్టీల పై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్య ప్రజాందోళనలు, అందుబాటులో ఉన్న మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసి రాష్ట్రాభివృద్ధిలో ప్రజలూ, ప్రజాస్వామిక శక్తులు, పౌరసమాజం భాగస్వామ్యం కావాల్సిన అవసరం నెలకొంది.  


మూలకుపడ్డ మూడు హామీలు


రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి ఆస్తుల విభజన, ఆర్ధిక లావాదేవీలతో పాటు పాలనా పరమైన అనేక అంశాలున్నాయి. ఈ చట్టంలో కాజీపేటలో కోచ్​ ఫ్యాక్టరీ నిర్మాణం, రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు మూడు ప్రధానమైన హామీలను పొందుపరిచారు. వీటికి రాజకీయ గ్రహణం పట్టించారు. 


– గిరిజన వర్సీటీ పై నిర్లక్ష్యం


ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ములుగు సమీపంలో ఉన్న జాకారంలో గిరిజన యూనివర్సీటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ఉన్న  దాదాపు 300 ఎకరాల భూమిని యూనివర్సీటీకి కేటాయించినప్పటికీ  నిబంధనల పేరుతో  అనుమతి ఇవ్వలేదు. ఈ యూనవర్సీటికి అనుమతులు తెచ్చి గిరిజన బిడ్డలకు, ఈ ప్రాంత పిల్లలకు ఉన్నత విద్యనందించాలి. 


– కోచ్​ ఫ్యాక్టరీ త్రిశంకు స్వర్గం


కాజీపేటలో  రైల్వే కోచ్​ ఫ్యాక్టరీని ఏర్పాటు ఏడున్నరేళ్ళుగా అడుగుముందుకు వేయలేదు. కాజీపేట పరిసరాల్లోని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని సేకరించి రైల్వేశాఖకు అప్పగించారు. అయితే ఈ భూమిని తమకు సకాలంలో అందించకపోవడం, దేవాదాయ శాఖ భూమి కావడం వల్ల జాప్యమైతుందని కేంద్రం  కుంటిసాకులు చెబుతున్నది. 


–  ‘ఉక్కు’ కౌగిలిలో బయ్యారం


బయ్యారం పరిసరాల్లో  ముడి ఇనుప ఖనిజ లభ్యత భారీగా ఉన్నందున ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టం హామీ ఇచ్చినప్పటికీ ప్రాథమిక స్థాయిలో ఈ ప్రాంతాన్ని  జియాలజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా ప్రతినిధుల  బృందం పరిశీలించింది. ఉక్కు పరిశ్రమ నిర్మాణం సందిగ్ధంలో పడేశారు. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలేవీ లేకుండా కేంద్రం తమాషా చేస్తున్నది. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని ప్రకటించిన సీఎం కేసీఆర్​ హామీ కూడా అమలుకు నోచుకోలేదు. 


–   హామీలకు రాజకీయ గ్రహణం 


విభజన చట్టం హామీల గురించి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, స్థానికుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు,  ఎన్నికల సమయంలో, స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, టీఆర్​ఎస్​లు పోటీపడి వాడుకుంటున్నారు. కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావించినపుడు టీఆర్​ఎస్​ ఈ హామీల దుమ్ముదులిపి తూతూ నిరసనలు చేస్తున్నారు.ఈ హామీలను ఫలవంతం చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ  అవకాశవాద వైఖరిని అనుసరిస్తూ కొర్రీలు పెడుతున్నది. అసలు ఈ హామీలు అమలు చేస్తారా? లేదా? లేక నిత్య నిరసన నినాదాలుగా మార్చి తమ పబ్బం గడుపుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


–  అటకెక్కిన ఫెడరల్​ స్పూర్తి 


ఫెడరల్​ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. రాజ్యంగ స్పూర్తికి భంగం కలిగిస్తొంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల (పార్టీలేవైనా) మధ్య ఉండాల్సిన స్నేహ సంబంధాలు కాస్తా ‘రాజకీయ’ అధికార’ సంబంధాలుగా మారిపోయాయి. ఈ పతనం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం చేస్తొంది. తమకు వ్యతిరేకమైన, తమ మాట వినని ప్రభుత్వాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోంది. ఆర్ధికపరమైన ఆంక్షలు విధిస్తోంది. అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు.  రాష్ర్ట ప్రభుత్వాలను అవహేళన చేస్తూ రాజకీయ లబ్దిపొందుతున్నారు. 


–  పరస్పర విమర్శలతో  పక్కదోవ


ఇటీవల బీజేపీ, టీఆర్​ఎస్​ రెండు పక్షాలు పరస్పరం విమర్శలు, దూషణలు చేసుకుంటూ రాజకీయం రక్తికట్టిస్తున్నారు. ఈ క్రమంలో విభజన హామీలను తెరపైకి తెచ్చి టీఆర్​ఎస్​ నిరసనలు చేపట్టారు. పార్లమెంట్​లో కూడా నిరసన తెలియజేశారు. దీనికి కేంద్రం కౌంటర్​ ఇచ్చేపనిలో నిమగ్నమయ్యారు. ప్రజలకు మాత్రం ఒరింగిందేమీ లేదు.  అధికారంలో ఉన్న రెండు పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల పాత్ర పోషిస్తూ విపక్షాలనూ ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారు. 


–  ఐక్య ప్రజా ఒత్తిడి పరిష్కారం


రాష్ట్రాభివృద్ధితో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విభజన హామీల అమలుకు అధికార పక్షాలపై ఒత్తిడి తేవాల్సి ఉంది.  హామీలు అమలు చేయాల్సిన బీజేపీపై ఒత్తిడి తెస్తూ టీఆర్​ఎస్​ నిర్లక్ష్యవైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది.   రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, పౌర సమాజం ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది.  ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రభుత్వాల పైన  ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఆందోళనల్లో కలిసొచ్చే అందరినీ కలుపుకుని ఐక్యపోరాటాన్ని చేపడితే లాభం చేకూరుతోంది. మూడు ప్రధాన డిమాండ్లు ఉమ్మడి వరంగల్​ జిల్లాకు సంబంధించినవే అయినందున ఈ జిల్లా ప్రజలూ, ప్రజా, హక్కుల సంఘాలు, కళాకారులు, నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్షపార్టీతో పాటు వామపక్ష, విపక్ష పార్టీలపైన మరింత బాధ్యత ఉంది. ఇప్పటికే కాజీపేట, బయ్యారంలో ఆందోళనలు జరుగుతున్నందున ఉమ్మడి జిల్లా స్థాయిలో వేదిక ఏర్పాటు చేస్తే ఆందోళనల విస్తృతి పెరిగే అవకాశం ఉంది. త్వరలో కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందున ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఈ దిశగా కలిసొచ్చే అన్ని రకాల శక్తులు కలిసి ముందుకు సాగితే ఫలితం లభిస్తోంది. 

Newsletter