మాటలు బారెడు.. చేతలు చారెడు

మాటలు బారెడు..

చేతలు చారెడు


రాష్ట్ర బడ్జెట్​లో చేనేతకు మొండిచెయ్యి

 అంకెల గారడీ లెక్కలు నేతన్నలకు అక్కరకొచ్చేనా..?

ఆశలపై నీళ్లు చల్లిన చేనేత జౌళి శాఖ మంత్రి


వేకువ ప్రతినిధి:రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్​లో అటుతిప్పి ఇటు తిప్పి చేసిన అంకెల గారడీల్లో అక్కరకొచ్చేది ఎంత అనేది ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న.  చేనేత జౌళీ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే  కల్వకుంట్ల తారకరామారావు స్వయంగా చూస్తున్న శాఖ కావడంతో రాష్ట్రంలోని నేతన్నలకు భారీ ఆశలే ఉండి ఉంటాయి.  రాష్ట్రంలోని సిరిసిల్లతో పాటు వరంగల్ ప్రాంతంలోని నేత బిడ్డలు బడ్జెట్ పై ఆశలెన్నో పెట్టుకొని ఉంటారు. తీరా రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఇటీవల తరచుగా చేనేతజౌళి శాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రానికి చేనేత మరమగ్గాల పరిశ్రమను ఆదుకునేందుకు చేతులు నొప్పి పుట్టేలా లేఖలు రాసినా పైసా విదల్చ లేదంటూ మీడియా ముఖంగా కేంద్రంపై దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అదనంగా రాష్ట్రంలో ని నేత బిడ్డల కోసం ప్రత్యేకంగా అదనపు నిధులేవైనా ఇస్తుందేమో అన్న ఆశ రాష్ట్రంలోని చేనేత మరమగ్గాల రంగాల ఎదురుచూపులకు నిరాశే మిగిలినట్లు బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

2017నుంచి నిధుల కేటాయింపు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం చేనేత జౌళి శాఖ ద్వారా 2017 నుంచి 2023 వరకు చేసిన కేటాయింపులు ఖర్చులు చూస్తే మంత్రికి నేత బిడ్డలపై ఉన్న మమకారం ఏపాటిదో తేలిపోతోంది. 2017-–18 బడ్జెట్ లో  రూ.1,200 కోట్లు కేటాయించారు. 201 8–-19లో అదే పద్దును మళ్లీ  కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2019–-20 బడ్జెట్ లో ఒక్కసారిగా  రూ.338 కోట్లకు తగ్గించేశారు . 2020-–21లో  మళ్లీ రూ. 338 కోట్లను కేటాయించారు. 2020–21, -22లో అవే పద్దులు పునరావృతం అయ్యాయి. ప్రస్తుతం 2022–-23 బడ్జెట్లో  రూ.400 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నాన్ ప్లాన్ గ్రాంట్ కలుపుకొని రూ. 467 కోట్లుగా తేల్చారు.

అరకొర నిధులతో హామీలు గాలికి..

మొత్తంగా ఈ అరకొర నిధులతో చేనేత మరమగ్గాల రంగాలకు ఏ మేరకు చేయూత అందుతుందన్నది ఏలిన వారే స్పష్టం చేయాలి. నిధుల్లో పెద్దమొత్తం బీసీ వెల్ఫేర్ ద్వారా బతుకమ్మ చీరల ఆర్డర్‌కు సంబంధించి రూ.400 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన నిధులు ఎటూ చేనేత జౌళి శాఖ నిర్వహణ, జీత భత్యాలకు పోను చేనేత మరమగ్గాల పరిశ్రమకు చేయూత ఎట్ల సాధ్యమవుతుందనేది అంతుచిక్కని విషయమేమీ కాదు. ఇప్పటికే సిరిసిల్ల ప్రాంతంలో వర్కర్ టు ఓనర్ పథకం పూరైపోయినట్లే ప్రచారం జరిగిపోతున్నా ఇప్పుడు బడ్జెట్ లో చూపించిన ఉత్త చేతులతో పథకం ఏమేరకు పూర్తవుతుందన్నది సందేహాస్పదమే. మరోవైపు వరంగల్​లో టెక్స్ టైల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చేసిన హామీలు దుబ్బాకలో చేనేత రంగాన్ని ఉద్ధరిస్తామన్న మాటలు ఎట్ల ఆచరణ సాధ్యం అవుతాయో చేనేత జౌళి శాఖ మంత్రే  చెప్పా లి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినంత ప్రచారం తీసుకొచ్చిన ప్రస్తావన గురించైతే చెప్పుకోవాల్సిందే. రాష్ట్రంలో రైతన్నలకు ఇస్తున్న రైతు బీమా మాదిరిగానే చేనేత మరమగ్గాల కార్మికులకు నేత బీమా అమలుకు సానుకూలత వ్యక్తం చేయడంతో బడ్జెట్ లో కేటాయింపుల సంగతి మర్చిపోయిన నేతన్నలు అధినేతలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాల్లో మునిగి ఉన్నా రు. పాలకులు వల్లెవేస్తున్న కోట్ల బడ్జెట్ లెక్కల్లో రాష్ట్రంలోని నేతన్నలకు చేయూత సంగతేమో కానీ ఉత్త చేతులైతే మిగిలాయి.

Newsletter