కనువిప్పులేని కాంగ్రెస్
కనువిప్పులేని కాంగ్రెస్
– కథ మళ్ళీ షరామాములు
– నాయకుల్లో గ్రూపు తగాదాలు
– రాహుల్ వస్తున్నా మారని తీరు
– కానరాని వరంగల్ భారీ సభ ఊపు
– మారకుంటే పాతరేయడం ఖాయం
వేకువ ప్రత్యేక ప్రతినిధి: రెండు పర్యాయాలు కేంద్రంలో, రాష్ట్రంలో జనం కర్రుకాల్చి వాతపెట్టినట్లు అధికారానికి దూరం చేసినా కాంగ్రెస్ నాయకులకు కనీస సిగ్గురావడంలేదు. కథ మళ్ళీ మొదటికొచ్చినట్లు షరామాములు గ్రూపులు, ఆధిపత్యాలు, తన్నులాటలతో కాలం వెల్లదీస్తున్నారు తప్ప ప్రజలకు అండగా నిలవాలనే కనీస చిత్తశుద్ధి కన్పించడంలేదు. పేరుకు పెద్దగా ఉన్న లీడర్లే బజార్లోపడ్డట్లు తన్నులాటలతో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు. వ్యక్తి ఆధిపత్యం ముందు పార్టీ ప్రతిష్ట గల్లంతైనా ఫర్వాలేదనే తీరులో రాష్ట్రంలోని ముఖ్యనాయకులు వ్యవహరిస్తున్నారు. ఎవరికివారు యమునాతీరు అన్నట్లు ముఖ్యనాయకులే తమ తమ ఆధిపత్యాలు, పట్టు కోసం తన్నుకు చస్తున్నారు. ఇందులో పార్టీని నమ్ముకున్న రెండవ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారు. నాయకుల చేతుల్లో పావులుగా మారి గ్రూపు తగదాల్లో నిండా మునిగిపోతున్నారు.
– మున్నాళ్ళముచ్చటగా మారిన ఢిల్లీ ఐక్యత
ఇటీవల కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ వేదికగా ఐక్యతారాగం పలకడంతో అబ్బా కాంగ్రెస్‌లో ఎంతమార్పు వచ్చిందని అందరూ అనుకునే లోపు అంతర్గతంగా ఉన్న గ్రూపులు భగ్గుమంటున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, మాజీ పీపీసీ చీఫ్ ఉత్తమ్, ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, హన్మంతరావు, పొన్నాల ఒక్కరేంది అంతా ఒకే రాగం తీసి ఆరున్నొక్క శృతిలో తామంతా ఒక్కటే అంటూ అధిష్టానం సమక్షంలో అలాయ్ భలాయ్లు తీసుకుని ఐక్యతను ప్రదర్శించారు. కానీ ఈ ఐక్యత అనుకున్నంత కాలం కూడా లేకపోవడం గమనార్హం. అప్పుడే పార్టీలో గ్రూపులు మళ్ళీ పెచ్చరిల్లుతున్నాయి. పరస్పరం బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ వీధి గొడవలకు దిగుతున్నారు.
– భారీ సభ ....అధినేత రాహుల్ రాక
ఈ నాయకులంతా కలిసికట్టుగా వచ్చెనెల 6వ తేదీన వరంగల్‌లో భారీ సభ పెట్టుకున్నారు. ఈ సభకు పార్టీ అధినేత రాహుల్‌గాంధీని ఆహ్వానించారు. కనీవినీ ఎరుగని స్థాయిలో సభను చారిత్రాత్మకంగా నిర్వహిస్తామంటూ భారీ డైలాగులు ముఖ్యనాయకులు వరుసపెట్టి ప్రకటిస్తున్నారు. లక్షల మంది జనాన్ని సమీకరించి అధికార టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటుతామంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిచ్చారు.
– కన్పించని వరంగల్ సభ ఊపు
ఎక్కడ ఆ సభకు సంబంధించిన ఊపు, ఉత్తేజం పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో పాదుకొల్పేందుకు కనీస ప్రయత్నం చేయకుండా మీడియా ముందు పెద్దపులి డైలాగ్‌లు వల్లెవేస్తున్నారు. జనంలో స్పందన కలిగించి భారీ జనసమీకరణ ప్రణాళికలు అమలు చేయకుండా లారీల సంఖ్యను బేరీజువేసుకుంటూ లక్షల్లో జనాన్ని తరలిస్తామంటూ ఉపన్యాసాలిస్తున్నారు. ఇదంతా చూస్తూ వరంగల్ వాసులు, వివిధ జిల్లాల కాంగ్రెస్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు కనీస కనువిప్పులేకపోవడం పట్ల సిగ్గుపడుతున్నారు. పైగా రైతు సంఘర్షణ సభ అంటూ పేరు పెట్టడం తప్ప ఇప్పటికీ కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో సైతం రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై ప్రచారం చేయకుండా, వారిని సమీకరించే ప్రయత్నం చేయకుండా నేతలు కాలు కదపకుండా కదనరంగంలో యుద్ధం చేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. రైతుల సమస్యలపై వారిని సమీకరించేందుకు రైతులు సమస్యలను అడ్రస్ చేసేందుకు ప్రయత్నించకుండా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు తాపత్రయపడుతున్నారు.
– నేతల ఎడమొఖం పెడముఖం
రాష్ట్రంలో అనేక పర్యాయాలు, అధికార పదవులును, పార్టీ పదవులను అనుభవించిన నాయకులు పార్టీకి రాష్ట్రంలో ఎదురైన సమస్యను పట్టించుకోకుండా తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలను ఇరుకున పెట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగదాలతో పలుచనవుతూ తామే ఇరుకున పడుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిది ఒక దారైతే, నిన్ననే దోస్తీ ప్రకటించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిది ఒక దారి. ఇక నిన్నటి వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌ది మరో దారి. మధ్యలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిది మరోక తీరు. ఒక విధంగా చెప్పాలంటూ ఢిల్లీ ఐక్యత తర్వాత జగ్గారెడ్డి తీరు కొంత మారింది. ఇక మధ్యలో సీనియర్ బ్యాడ్జ్ ఉన్న హన్మంతరావుది ఒకతీరైతే, భట్టిది మరోక తీరు, మధ్యలో రేణుకాచౌదరి తన ఉనికి కోసం యత్నం చేస్తున్నారు. మధుయాష్కీది మరో రూట్, సభ ఏర్పాట్ల కోసం తమదైన ప్రయత్నం చేస్తున్న కొందరు సిన్సియర్ నాయకులున్నారు. భారీ సభ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజాన్ని తెచ్చి, కదలిక తెచ్చేందుకు పీసీసీ చీఫ్‌గా తన వంతు ప్రయత్నం రేవంత్ ప్రారంభించారు. ఇదే అదునుగా రేవంత్‌రెడ్డి తన పట్టును, ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు జిల్లా పర్యటనలు ప్రారంభించారు. ఈ పర్యటనలు ఇష్టం లేని ముఖ్యనాయకులు ముక్కీరుస్తున్నారు. వరంగల్ పర్యటన కాస్తా సానుకూలంగా మారినప్పటికీ ఖమ్మంలో భట్టి వర్సెస్ రేణుకచౌదరి మధ్య గొడవలు బజారునుపడ్డాయి. కామారెడ్డిలో పార్టీ నాయకుల మధ్య గ్రూపు తగదాలతో సస్పెన్స్‌ల వరకు వచ్చాయి. నల్లగొండ పర్యటనకు ఆ పార్టీ నేత వెంకట్‌రెడ్డి తాను దూరమంటూ బహిరంగంగానే ప్రకటించారు. పైగా పార్టీ ఇంచార్జ్ మానిక్కంఠాగూర్ హైదరాబాద్‌లో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
– మారకుంటే పాతరేయడం ఖాయం
అధికార పదవులన్నీ అనుభవించి ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులకు ఇంకా సిగ్గురావడంలేదని, పార్టీని నమ్ముకున్న కేడర్‌ను బలిపశువులను చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా కనువిప్పు కలుగకపోతే వచ్చేసారి తెలంగాణలో ఆ పార్టీని శాశ్వతంగా బొందపెట్టే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కలిసి ముందుకు సాగి ప్రజలకు అండగానిలుస్తారా? తమ గోయ్యి తామే తీసుకుంటారా? రానున్న కొద్దిరోజుల్లో తేలనున్నది.